: సరబ్ జిత్ మృతిపై బాలీవుడ్ ది ఒకటేమాట
సరబ్ జిత్ మరణంపై బాలీవుడ్ ఏకరీతిగా స్పందించింది. సరబ్ ను చంపేయడం ద్వారా పాకిస్తాన్ తన కుత్సిత బుద్ధిని చాటుకుందని బాలీవుడ్ ప్రముఖులు ముక్తకంఠంతో ట్విట్టర్లో విమర్శించారు. ఎట్టకేలకు సరబ్ జిత్ కు స్వేచ్ఛ లభించిందని, అతని కుటుంబానికి దేవుడే అండగా నిలవాలని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించగా.. సరబ్ జిత్ సుదీర్ఘ నిరీక్షణ ఇలా ముగియడం బాధాకరమని ప్రముఖ దర్శకుడు మధుర్ బండార్కర్ పేర్కొన్నారు.
ఇక గీత రచయిత జావేద్ అక్తర్ అయితే.. 'ఏదో ఒక రోజు కార్గిల్ ఉదంతాన్ని మర్చిపోతానేమో. కానీ, సరబ్ జిత్ మరణాన్ని మాత్రం మరువలేను' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సీనియర్ డైరెక్టర్ మహేష్ బట్ స్పందిస్తూ, పాక్ ప్రభుత్వం మానవతను సంతరించుకునేలా అక్కడి పౌరసమాజం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.