: తరుణ్ విజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా.. ఒక్కటైన విపక్షాలు... పార్లమెంటులో నిరసనలు
దక్షిణ భారత ప్రజలు నల్లవాళ్లు అంటూ బీజేపీ నేత తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. జాత్యహంకార వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి స్పీకర్ పోడియంను చుట్టుముట్టాయి. విపక్షాల ఆందోళన మధ్య రాజ్యసభలో జీరో అవర్ కొనసాగుతుండగా, లోక్ సభలో ఈ అంశపై చర్చకు ఇప్పుడు అనుమతించనని, జీరో అవర్ లో చర్చకు అనుమతిస్తానని స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు.
కాగా, అల్ జజీరా ఛానెల్ లో చర్చలో పాల్గొన్న సందర్భంగా భారత్ లో జాత్యహంకారం అనేది లేదని, దక్షిణ భారతీయులంతా నల్లగా ఉంటారని, అయినా తాము వారితో సామరస్యపూర్వకంగా ఉంటామని గొప్పగా చెప్పారు. ఆ తరువాత క్షమాపణలు చెబుతూ, తన వ్యాఖ్యలు దక్షిణ భారతీయులను కించపరిచేందుకు చేసినవి కాదని వివరణ ఇచ్చారు.