: లాడెన్ తలలోకి మూడు బుల్లెట్లు దించాను: నేవీ సీల్ షూటర్ రాబర్ట్ ఒనీల్
అమెరికాను ముప్పుతిప్పలు పెట్టి, పాకిస్థాన్ లోని అబోటాబాద్ లో తలదాచుకున్న అల్ ఖైదా చీఫ్, కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ తలలోకి మూడు బుల్లెట్లు దించానని అమెరికా నేవీ సీల్ మాజీ షూటర్ రాబర్ట్ ఒనీల్ తెలిపారు. పాకిస్థాన్ లోని అబోటాబాద్ లోని ఆర్మీ స్థావరానికి కూతవేటు దూరంలో తలదాచుకున్న లాడెన్ స్థావరంపై జరిపిన మెరుపుదాడిని వివరిస్తూ ‘ద ఆపరేటర్’ పేరుతో ఆయన ఒక పుస్తకం రాశారు.
అందులో రాబర్ట్ ఓనీల్ పలు విషయాలు వివరించారు. లాడెన్ ను మట్టుబెట్టిన విధానాన్ని ఆయన వివరించారు. లాడెన్ తలలోకి మూడు బుల్లెట్లు దించానని, వాటి ధాటికి అతని తల ఛిద్రమైపోయిందని, అందులో కొన్ని భాగాలు చెల్లాచెదురైపోయాయని ఆయన తెలిపారు. అతనే లాడెన్ అని గుర్తించేందుకు ఛిద్రమైపోయిన భాగాలు ఒక చోట చేర్చాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.