: తల్లి తల నరికి కాళీమాతకు బలిచ్చిన తనయుడు... అరెస్ట్
పశ్చిమ బెంగాల్‌లోని పురులియా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాళీమాత తన కలలోకి వచ్చిందని, తన తల్లి తలను బలి ఇవ్వమని చెప్పిందని అంటూ.. కాళీమాత ఆలయం ఆవరణలో నిద్రిస్తున్న తన తల్లి మెడను బ్లేడుతో పూర్తిగా కోశాడు. ఆ తర్వాత తన సోదరుడి ఇంటికి వెళ్లి, ఆ విషయాన్ని చెప్పాడు. దీంతో ఆయన తన తల్లి కోసం కాళీమాత ఆలయానికి పరుగులు తీశాడు. తన సోదరుడు చెప్పినట్లుగానే ఆమె తల రక్తపు మడుగులో పడి ఉండడంతో ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు పలు వివరాలు తెలిపారు. రెండు రోజుల క్రితం రాత్రి పూట మృతురాలి మూడవ కొడుకయిన 35 ఏళ్ల నారాయణ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పారు. సదరు నిందితుడు తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడని, అలా చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని దేవత తనతో చెప్పిందని అన్నాడని తెలిపారు. కాగా, నిందితుడు క్షుద్రపూజలు చేస్తుంటానని తిరుగుతుంటాడని స్థానికులు అంటున్నారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.