: ఎంతపనిచేశావు 'బంగారుతల్లీ..'!
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాజాగా ప్రవేశపెట్టిన 'బంగారుతల్లి' పథకం ఆయన వ్యతిరేక వర్గానికి ప్రస్తుతం ఓ అస్త్రంలా మారింది. ఈ పథకం గురించి సీఎం తమతో మాటమాత్రం చర్చించకుండానే విధివిధానాలు ఖరారు చేయడం పలువురు మంత్రులకు మింగుడుపడడంలేదు. పథకం ప్రవేశపెడుతున్నట్టు సీఎం ప్రకటించి వారం కూడా గడవకముందే, అసమ్మతి గళాలు వినిపించసాగాయి.
ఈ పథకం గురించి తమకేమీ తెలియదని, సీఎం తమతో సంప్రదించి ఈ పథకం విధివిధానాలకు రూపకల్పన చేయలేదని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆక్రోశం వ్యక్తం చేయగా.. పథకం గురించి వివరాలేవీ తెలియవని, తెలుసుకున్నాకే మాట్లాడతానని పీసీసీ ఛీఫ్ బొత్స వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో బొత్స నివాసంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, వట్టి వసంత్ కుమార్, డీఎల్ తదితరులు ఈ మధ్యాహ్నం సమావేశమయ్యారు. సీఎం ఏకపక్ష ధోరణిపైనే ప్రధానంగా చర్చ సాగినట్టు తెలుస్తోంది. కిరణ్ వైఖరిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.