: గుజరాత్‌పై నైట్‌రైడర్స్ రికార్డు విజయం.. లయన్స్ బౌలర్లను ఊచకోత కోసిన లిన్!
గుజరాత్ సొంతగడ్డ రాజ్‌కోట్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ చిత్తుగా ఓడింది. 184 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్‌రైడర్స్ 14.5 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా రికార్డు విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. సురేశ్ రైనా (51 బంతుల్లో 7 ఫోర్లతో 68 నాటౌట్), దినేశ్ కార్తీక్ (25 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 47), బ్రెండన్ మెక్ కలమ్ (24 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 35) మెరుపులు మెరిపించారు. భారీ స్కోరు సాధించినా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో గుజరాత్‌కు ఓటమి తప్పలేదు.
184 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నైట్‌రైడర్స్ ఏ దశలోనూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. గుజరాత్ బౌలర్లను నైట్‌రైడర్స్ ఓపెనర్లు లిన్, గంభీర్‌లు ఊచకోత కోశారు. దొరికిన బంతులను దొరికినట్టు బౌండరీలకు తరలించారు. అనుకోకుండా ఓపెనర్ అవతారమెత్తిన లిన్ (41 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 93) హద్దుల్లేనట్టు చెలరేగిపోయాడు. మ్యాచ్ ముగిసేసరికి అంచనాల్లేని ఈ ఆటగాడు హీరోగా మారిపోయాడు. మరోవైపు నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ (48 బంతుల్లో 12 ఫోర్లతో 76) బ్యాట్ ఝళిపించడంతో 14.5 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే భారీ విజయం సొంతమైంది. తృటిలో శతకం చేజార్చుకున్న లిన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.