: కాలిఫోర్నియాలో రోడ్డెక్కిన జలకన్య... ఈ అంతు చిక్కని రహస్యం పోలీసులకు సవాల్!
గతంలో వెంకటేష్ హీరోగా, శిల్పాశెట్టి హీరోయిన్ గా వచ్చిన 'సాహసవీరుడు సాగరకన్య' సినిమా గుర్తుందిగా? ఆ సినిమాలో జలకన్య పాత్ర ఉంటుంది. అచ్చు అలాంటి ఓ అమ్మాయే ఇప్పుడు బయటకు వచ్చి అంతుచిక్కని రహస్యంగా మారి అమెరికా పోలీసులకు సవాల్ విసురుతోంది. ఓ సరస్సుకు సమీపంలో రోడ్డుపై వస్తున్న ట్రక్కుని ఆపిన ఓ యువతి తనను ఆసుపత్రికి తీసుకెళ్లమని డ్రైవరును కోరింది.
తన పేరు జో అన్నా అని, తాను జలకన్యనని, పక్కనే ఉన్న సరస్సులో ఉంటానని చెప్పింది. ఇక ఆమె శరీరంలోని అధిక భాగం నగ్నంగా, శరీరమంతా తడిగా ఉంది. కాళ్లు సైతం అందరిలా లేవు. వేళ్ల మధ్య చర్మం ఉంది. తన గురించిన మరిన్ని వివరాలేమీ ఆమె చెప్పడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న ఈమె, ఒక్కోసారి చాలా భయంకరంగా ప్రవర్తిస్తోందని వైద్యులు అంటున్నారు. జో అన్నా ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక ప్రచారం కూడా మొదలు పెట్టారు. తప్పిపోయిన వ్యక్తుల జాబితాలో చేర్చి, ఎవరైనా గుర్తిస్తే తమకు చెప్పాలని కోరుతున్నారు.