: అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన పాక్ టెస్టు జట్టు కెప్టెన్ మిస్బావుల్ హక్
అంతర్జాతీయ క్రికెట్ కు పాకిస్థాన్ టెస్టు జట్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ (42) రిటైర్మెంట్ ప్రకటించాడు. లాహోర్ లోని గడాఫీ స్టేడియం వద్ద మిస్బా మాట్లాడుతూ, ఈనెల 21 నుంచి వెస్టిండీస్ తో ప్రారంభం కానున్న మూడు టెస్టుల సిరీసే తన కెరీర్ లో చివరి టెస్టు సిరీస్ అని ప్రకటించాడు. తన రిటైర్మెంట్ పై ఎలాంటి ఒత్తిడి లేదని తెలిపాడు. క్రికెట్ ను ఆస్వాదించానని మిస్బా తెలిపాడు. ఇప్పటకే అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత పెద్ద వయస్కుడిగా ఉన్న మిస్బావుల్ హక్...తన కెరీర్ లో 53 టెస్టు మ్యాచ్ లకు సారథిగా వ్యవహరించగా అందులో 24విజయాలు, 11డ్రాలు, 18 ఓటములు అందుకున్నాడు.
తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నప్పటికీ దేశవాళీ క్రికెట్ నుంచి తప్పుకోవడం లేదని ప్రకటించాడు. తన కెరీర్ లో భద్రతా సమస్యలతో సొంత గడ్డపై ఆడలేకపోవడం బాధగా ఉందని మిస్బా అన్నాడు. మిస్బా 2015లోనే పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 2015లో వరల్డ్ కప్ సొంతం చేసుకోవాలని భావించినా తన కల నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.