: నేనీ స్థితికి రావడానికి చాలా కష్టపడ్డాను... నన్ను నేరస్తుడిని చేస్తున్నారు: బాలీవుడ్ దర్శకుడు వికాస్ బెహల్
తానీ స్థితికి వచ్చేందుకు చాలా కష్టపడ్డానని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వికాస్ బెహల్ తెలిపాడు. గోవాలో ఫాంటమ్ ఫిల్మ్స్ షూటింగ్ సందర్భంగా తనతో వికాస్ బెహల్ అసభ్యంగా ప్రవర్తించాడని చెబుతూ ఓ యువతి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్శకుడు వికాస్ బెహల్ మీడియాతో మాట్లాడుతూ, తనపై వస్తున్న వార్తలన్నీ అబద్ధమని చెప్పాడు. గోవా షూటింగ్ లో మీడియాలో ప్రసారమవుతున్న సంఘటనలు ఏవీ చోటు చేసుకోలేదని అన్నాడు. తానింకా ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థలోనే పని చేస్తున్నానని... తనపై ఆరోపణలు చేస్తున్న యువతి గురించి గతంలో తాను విన్నానని చెప్పాడు.
తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న యువతి తమ వద్ద ఉద్యోగిని కాదని ఆయన అన్నాడు. అయినప్పటికీ సినిమాలో కలిసి పనిచేశామని, మీడియా సాక్షిగా ఆమెతో కూర్చుని మాట్లాడేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. మీడియా ముందే నిజానిజాలు అడుగుతానని అన్నాడు. తాను తప్పు చేసి ఉంటే క్షమాపణలు చెప్పేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపాడు. తానీ స్థాయికి వచ్చేందుకు చాలా కష్టపడ్డానని, తనను నేరస్తుడిగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.