: మంత్రివర్గంలో కొందరికి చోటు కల్పించకపోవడం బాధ కలిగించింది: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పదవులు దక్కని నేతలు పార్టీపై అలిగిన విషయాన్ని గురించి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. క్యాబినెట్‌లో కొందరు సమర్థులకు చోటు కల్పించకపోవడం బాధ కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో 26 మందికి మించి చోటు కల్పించడం సాధ్యం కాదనే విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ప్రతిస్థానంలో విజయం సాధించేందుకు అందరూ కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సంస్థాగత ఎన్నికలను మహానాడులోగా పూర్తి చేయాలని చెప్పారు. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వంపై జరుగుతున్న ప్రతికూల ప్రచారాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. అలాగే అంతర్గతంగా పరిష్కారం దొరికే సమస్యలపై పార్టీ నేతలు రోడ్డెక్కవద్దని సూచించారు.