: వైసీపీ నుంచి ధర్మవరం సుబ్బారెడ్డి సస్పెన్షన్.. గాలం వేస్తున్న టీడీపీ!
కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం వైసీపీలో అంతర్గత పోరు ముమ్మరమైంది. జిల్లా వైసీపీ కార్యదర్శిగా పని చేస్తున్న సుబ్బారెడ్డికి, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రరెడ్డి (రాజారెడ్డి)కి చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ప్రయత్నించారు. అయినా, సయోధ్య సాధ్యం కాలేదు. విభేదాలు మరింత ముదిరాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇవి మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ప్రకటించారు.
వెంటనే టీడీపీ రంగంలోకి దిగింది. సుబ్బారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలను ప్రారంభించారు. ఇప్పటికే డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కేఈ ప్రతాప్ సన్నిహితులు సుబ్బారెడ్డితో చర్చలు జరిపారు. టీడీపీలో చేరితే, సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆయనకు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ వ్యవహారం డోన్ నియోజకవర్గంలో హీట్ పెంచుతోంది.