: మరో మూడు రోజులు సమ్మె కొనసాగితే, నిలిచిపోనున్న వెంకన్న లడ్డూ తయారీ, అన్నదానం!
గడచిన ఎనిమిది రోజులుగా జరుగుతున్న సరుకు రవాణా లారీల యాజమాన్యాల సమ్మెతో తిరుమలలో నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడింది. రోజువారీ వితరణలో భాగమైన అన్న ప్రసాదాల తయారీకి సైతం ఇబ్బందులు ఏర్పడుతుండగా, మరో మూడు రోజుల్లో సరుకులు కొండపైకి చేరుకోకుంటే, భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూల తయారీ కష్టమవుతుందని టీటీడీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు మిగతా ప్రసాదాలైన పులిహోర, దద్దోజనం, కట్టెపొంగలి, దోశలు వంటి వాటి తయారీకి అవసరమయ్యే పదార్థాలు సైతం నిండుకున్నాయని, సమాచారం. సరుకులను ఎలాగైనా కొండపైకి తెప్పించేందుకు టీటీడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూసేందుకు సహకరించాలని టీటీడీ స్థానిక లారీ యజమానుల సంఘాన్ని కోరింది. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ అభయమిస్తున్నప్పటికీ, నిండుకున్న నిత్యావసరాలతో అన్న ప్రసాదాల వితరణకూ ఇబ్బందులు తప్పేలా లేవు.