: ఒకప్పుడు మంచి స్నేహితులైన కాజోల్, కరణ్ జొహార్.. ఇప్పుడు మొహాలు కూడా చూసుకోవడం లేదు!
బాలీవుడ్ ప్రముఖ నటి కాజోల్, దర్శకనిర్మాత కరణ్ జొహార్ లు ఒకప్పుడు చాలా మంచి మిత్రులు. కానీ, ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. ఎదురెదురు పడినా మొహాలు తిప్పుకుని పోతున్నారు. గత ఏడాది కరణ్ సినిమా 'యే దిల్ హై ముష్కిల్', కాజోల్ భర్త అజయ్ దేవగణ్ చిత్రం 'శివాయ్'లు ఒకే సమయంలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఈ సందర్భంగా వీరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో కరణ్, కాజోల్ స్నేహబంధం కూడా తెగిపోయింది.
కరణ్ జొహార్ ఇటీవలే సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తండ్రి అయ్యాడు. ఈ నేపథ్యంలో, కరణ్ పిల్లలను చూడ్డానికి వెళతారా? అంటూ కాజోల్ ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా, "ఆ విషయం గురించి అడక్కండి. అలాంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను" అంటూ తేల్చి చెప్పింది.
మరోవైపు, 'అన్ సూటబుల్ బోయ్' పేరుతో కరణ్ జొహార్ తన ఆత్మకథను రాసుకున్నాడు. ఈ పుస్తకంలో కాజోల్ గురించి చెబుతూ, 'ఆమె నా జీవితంలో నుంచి వెళ్లిపోయింది' అని పేర్కొన్నాడు.