: నన్ను ‘అన్నయ్య’ అని పిలవమని చిరంజీవికి ఎన్నోసార్లు చెప్పాను: ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం
ప్రముఖ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం అమెరికా పర్యటనలో చాలా బిజీగా ఉన్నారు. ‘ఎస్పీబీ 50’ పేరిట జరుగుతున్న కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ, ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను, వీడియో లను తన ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతా ల ద్వారా పోస్ట్ చేస్తూ బాలు యాక్టివ్ గా వున్నారు. బాలు అభిమానులు, నెటిజన్లు ఆయన పోస్ట్ లను ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలో రమణ మణి అనే నెటిజన్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా బాలుకు ఓ ప్రశ్న వేశాడు.
ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే .. ‘నాకు తెలుసు సార్. మీరు ఎంతగా కష్టపడి పైకి వచ్చారో. కానీ, ప్రతి ఒక్కరి నుంచి మీరు గౌరవం ఎందుకు కోరుకుంటారు.. చిరంజీవి మిమ్మల్ని ‘అన్నయ్య’ అని పిలిచే వారని, కానీ, ఆయన కూడా ‘బాలూ గారూ’ అని సంబోధిస్తున్నారని మీరే చాలాసార్లు చెప్పారు. ఎందుకని, ఎదుటి వారు మిమ్మల్ని ఎప్పుడూ గౌరవించాలని కోరుకుంటారో నాకు అర్థం కావడం లేదు .. నాకు నచ్చలేదు. కానీ, పాటల విషయానికొస్తే, మిమ్మల్ని ఇష్టపడినంతగా మరెవరినీ నేను ఇష్టపడను’ అని పోస్ట్ చేశాడు.
ఈ పోస్ట్ ను చూసిన బాలు స్పందించాల్సిన అవసరం తన కేంటని ఊరుకోకుండా, సమాధాన మిచ్చారు. ‘సార్, ‘బాలూ గారు’ అని చిరంజీవి నన్ను పిలుస్తుంటే.. అతనికి చెప్పాను, ‘గతంలో నన్ను అన్నయ్య అని నువ్వు పిలిచేవాడివి కదా. ఇప్పుడు ‘గారు’ అనే పిలుపు ఎందుకు..‘ అన్నయ్య’ అనే పిలువు.. అని చెప్పాను. నేను అలా కోరింది గౌరవం కోసం కాదు, ప్రేమ కోసం’ అని బాలు రిప్లై ఇచ్చారు.