: పార్లమెంటులో ఈవీఎం ట్యాంపరింగ్ గోల... ఈసీ దగ్గరే తేల్చుకోండని బీజేపీ ఎద్దేవా!
ఈ ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తరువాత మధ్యప్రదేశ్ లో ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం రాజ్యసభను కుదిపేసింది. బీఎస్పీ నేత మాయావతి, సమాజ్ వాదీ నేత రాంగోపాల్ యాదవ్ తదితరులు, బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈవీఎంలను తమకు అనుకూలంగా మార్చుకుంటోందని ఆరోపించగా, విపక్ష సభ్యులంతా వారికి మద్దతు పలికారు.
ఈ విషయమై సభలో రభస జరుగుతుండగా, బీజేపీ స్పందిస్తూ, ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని ఈసీ వద్దే తేల్చుకోవాలని, సభలో సమయాన్ని వృథా చేయవద్దని, ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలను సాకుగా చూపుతున్నాయని ఎద్దేవా చేసింది. బీజేపీ ఎంపీ ముఖ్తార్ అబ్బాస్ నక్వీ మాట్లాడుతూ, ఎన్నికల ఓటమిని విపక్షాలు తప్పనిసరిగా ఆమోదించాలని అన్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే ఎలక్షన్ కమిషన్ నే అడగాలని సూచించారు. ఈ వివాదంలో కాంగ్రెస్ కల్పించుకుంటూ, ఎన్నికలను పూర్తి పారదర్శకంగా జరిపించేందుకు త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో ఈవీఎంలను వాడరాదని సూచించింది. సభ్యుల నినాదాలు సద్దుమణగక పోవడంతో సభ వాయిదా పడింది.