: కోదండరామ్ కు గవర్నర్ పదవిని ఆఫర్ చేసిన బీజేపీ... తనకొద్దన్న ఉద్యమనేత!
తెలంగాణ ఉద్యమ నేత, జేఏసీ నాయకుడు కోదండరామ్ కు భారతీయ జనతా పార్టీ గవర్నర్ పదవిని ఆఫర్ చేయగా, ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. కేంద్రంలో ఉన్నది తమ ప్రభుత్వమేనని, గవర్నర్ పదవిని ఇప్పిస్తాం, తీసుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి స్వయంగా కోదండరామ్ కు ఆఫర్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. బీజేపీ ఆఫర్ కు కృతజ్ఞతలు చెబుతూనే, తనకు అటువంటి ఆలోచన లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడమే తన ముందున్న కర్తవ్యమని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ఉద్యమాలు తప్ప మరో ఆలోచన లేదని ఈ సందర్భంగా కిషన్ రెడ్డితో కోదండరామ్ అన్నారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.