: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న బాహుబలి-2 కథ....కట్టప్ప బాహుబలిని అందుకే చంపాడా?


కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న ప్రశ్న ఎంత కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ ప్రశ్నకు సమాధానం 'బాహుబలి కన్ క్లూజన్' లో ఇస్తామని దర్శకుడు రాజమౌళి తెలిపాడు. ఈ నేపథ్యంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో సమాధానం తెలిసిపోయిందంటూ ఒక కథనం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ కథాకమామీషు వివరాల్లోకి వెళ్తే... ఒక సందర్భంలో ఎదురైన గిరిజన రాజు కుమార్తె దేవసేనతో బాహుబలి ప్రేమలో పడతాడు. రాజ్యకాంక్ష బలంగా ఉన్న భల్లాలదేవ సోదరుడిని అడ్డుతొలగించుకునేందుకు కుయుక్తితో అతని ప్రేమను ప్రోత్సహిస్తాడు. ఇంతలో మాహిష్మతి సామ్రాజ్యంలోకి వచ్చేందుకు దేవసేన నిరాకరిస్తుంది. దీంతో రాజ్యకాంక్ష లేని బాహుబలి రాజ్యాన్ని వదిలి అడవిబాట పడతాడు. దీంతో బాహుబలిని ప్రోత్సహిస్తున్న భల్లాలదేవ, వారి ప్రేమ గురించి తల్లికి లేనిపోనివి కల్పించి చెబుతుంటాడు. దీంతో రాజ్యాధికారం నెమ్మదిగా హస్తగతం చేసుకుంటాడు.

అప్పటి నుంచి బాహుబలిని అంతమొందించడమే భల్లాలదేవ లక్ష్యమైపోతుంది. తను నమ్మిన బంటులతో మాహిష్మతి రాజ్యంలో అరాచకాలు చేయిస్తుంటాడు. అవన్నీ బాహుబలి అండతో ఆటవికసైన్యం చేస్తోందని ప్రచారం చేయిస్తాడు. దీనిని రాజమాత సులువుగా నమ్మేలా చేస్తాడు. దీంతో బాహుబలిని తక్షణం తనవద్దకు రావాలని ఆర్డర్ వేస్తుంది. అయితే బాహుబలికి ఆ వార్త చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఈ క్రమంలో మాహిష్మతి సైన్యం భల్లాలదేవ ఆదేశాలతో ఆటవికులపై దాడులు చేస్తుంది. అంతే కాకుండా గిరిజన స్త్రీలను చెరబడుతుంది. వీటిని శివగామికి తెలియకుండా భల్లాలదేవ జాగ్రత్తలు తీసుకుంటూ బందిపోటు దాడులు అధికమయ్యాయని, మాహిష్మతి ప్రజలు ప్రశాంతంగా బతకలేకపోతున్నారని శివగామికి నూరిపోస్తుంటాడు.

 దీంతో అంతర్గత కలహాలు ప్రారంభమయ్యాయని భావించిన శివగామి బాహుబలిని బంధించి తేవాలని ఆదేశిస్తుంది. భల్లాలదేవుడు కోరుకున్న ఆదేశాలు రావడంతో బాహుబలిపై దండయాత్రకు బయల్దేరుతాడు. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న బాహుబలి, తన భార్య దేవసేనతో కలిసి భల్లాలదేవతో పోరాటానికి బయల్దేరుతాడు. ఈ సమయంలో చోటుచేసుకున్న సంభాషణతో భల్లాలదేవుడి వెంట వచ్చిన సైన్యంలో కొంత చీలిక వస్తుంది. దీంతో యుద్ధం ప్రారంభమవుతుంది. ఇద్దరూ హోరాహోరీగా పోరాడుతున్న సమయంలో కోటకు కాపలాగా ఉన్న కట్టప్పను రాజమాత యుద్ధభూమికి పంపుతుంది. బాహుబలిని బంధించి లేదా అంతమొందించి రమ్మని ఆదేశిస్తుంది.

కట్టప్ప యుద్ధ భూమికి వెళ్లే సమయానికి భల్లాదేవ ఓటమి అంచున ఉంటాడు. దీంతో బాహుబలిని కట్టప్ప వెనక నుంచి బల్లెంతో పొడిచి చంపుతాడు. ఈ క్రమంలో దేవసేన జరిగినదంతా రాజమాత శివగామికి చెబుతుంది. దీంతో బాహుబలిని పొట్టనబెట్టుకున్నందుకు క్షోభపడుతుంది. ఈ క్రమంలో కోడలు గర్భవతి అని తెలిసి కోటలోనే ఉండమంటుంది. ప్రసవ సమయంలో అక్కడి వారి కుట్రలు పసిగట్టిన శివగామి బాహుబలి కొడుకుని తీసుకుని పారిపోతుంది. తరువాత జరిగిన కథను 'బాహుబలి: ద బిగెనింగ్' సినిమాలో రాజమౌళి చూపించిన సంగతి తెలిసిందే. ఈ కథ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీనికి గ్రాఫిక్స్ ను ఊహించుకోగలిగితే సినిమా చూసినట్టే ఉంటుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News