: ఐపీఎల్ సంబరాలు వచ్చేశాయి... నేడే తొలి మ్యాచ్!
నేడు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సంబరాలు షురూ కానున్నాయి. వినోద కార్యక్రమాలు సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమై 6:51 నిమిషాలకు ముగుస్తాయి. తొలుత గోల్ఫ్ కార్ట్ లలో టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లను స్టేడియంలోకి తీసుకొస్తారు. వారు వస్తున్న సమయంలో వారి గురించి ఏవీని స్టేడియంలో ప్రదర్శించనున్నారు. అనంతరం వారిని బీసీసీఐ ఘనంగా సత్కరించనుంది. ఆ తర్వాత వారు మాట్లాడతారు. అనంతరం, సుమారు ఆరు నిమిషాలపాటు అమీ జాక్సన్ పలు బాలీవుడ్ సినిమా పాటలకు డాన్స్ చేయనుండగా, తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను చాటుతూ నృత్య రూపకాలు ప్రదర్శించనున్నారు.
లేజర్ షో, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం ఐపీఎల్ అసలు మజా షురూ అవుతుంది. రాత్రి 8 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. అనంతరం సుమారు 47 రోజుల పాటు 60 మ్యాచ్ లు క్రికెట్ అభిమానులను అలరించనున్నాయి. గతంలో లేని విధంగా ఈసారి ప్రతి జట్టు పాల్గొనే తొలి మ్యాచ్ కు ముందు ఆరంభ వేడుకలు నిర్వహించనున్నారు. ఈసారి అభిమానులను స్టేడియంకు రప్పించేందుకు ఆయా జట్లు భారీ ప్రణాళికలు రచించినప్పటికీ....పలువురు స్టార్ ఆటగాళ్లు తొలి దశలో ఐపీఎల్ టోర్నీకి అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఈసారి ఐపీఎల్ ఊహించినంత సక్సెస్ అవుతుందా? అన్న అనుమానం నెలకొంది.