: చైనా హెచ్చరికల నడుమ అరుణాచల్ ప్రదేశ్ లో ప్రవేశించిన దలైలామా
చైనా హెచ్చరికలు, బెదిరింపుల నడుమ టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఎట్టకేలకు అరుణాచల్ ప్రదేశ్ లో ప్రవేశించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని బొండిలాకు చేరుకున్న 14వ దలైలామాకు అరుణాచల్ ప్రదేశ్ వాసులు ఘన స్వాగతం పలికారు. తవాంగ్ లో బౌద్ధమతానికి సంబంధించిన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. గత కొన్నేళ్ళుగా భారత్ లో ఆశ్రయం పొందుతున్న దలైలామా అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది మొదలు ఆయన పర్యటనను అడ్డుకునేందుకు చైనా పలురకాలుగా ప్రయత్నించింది.
వాటిని భారత్ పట్టించుకోకపోవడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు అవకాశం ఉందని హెచ్చరించింది. దానిని కూడా భారత్ పట్టించుకోకపోవడంతో, దౌత్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. దీంతో మండిపడ్డ భారత్...'మా దేశ వ్యవహారాల్లో తలదూర్చకపోవడమే చైనాకు శ్రేయస్కరమ'ని తేల్చిచెప్పింది. మేమేం చేయాలి? చేయకూడదు? అన్నది ఎవరో చెబితే చేస్తామని ఊహించవద్దని హెచ్చరించింది. అయితే అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని వాదిస్తున్న చైనా, దలైలామా రాకపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.