: సిరియా సైన్యం రసాయన ఆయుధ దాడిలో 58 మంది మృతి
సిరియాలో ఐఎస్ఐఎస్, రెబల్స్ మధ్య భీకరయుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐఎస్ఐఎస్ ను పారద్రోలేందుకు సిరియా సైన్యం భీకర దాడులకు తెరతీసింది. ఈ క్రమంలో వాయవ్య సిరియాలోని ఇబ్లిబ్ ప్రాంతాన్ని ఐఎస్ఐఎస్ నుంచి విముక్తి చేసేందుకు సిరియా సైన్యం ప్రమాదకరమైన రసాయన ఆయుధాలతో దాడులు చేసిందని, ఈ దాడిలో 11 మంది చిన్నారులు సహా 58 మంది మృత్యువాత పడ్డారని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియా మానవహక్కుల సంఘం ఆరోపించింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదాన్ని అణచివేయాల్సిందేనని, అయితే అందుకు రసాయన ఆయుధాలు సరైన విధానం కాదని పలువురు మానవహక్కుల ప్రతినిధులు పేర్కొంటున్నారు. దీనిపై సిరియా సైన్యం స్పందించింది. తాము రసాయనిక దాడి చేశామనడం అవాస్తవమని స్పష్టం చేసింది. ఇంతవరకు తాము రసాయన ఆయుధాలను వినియోగించలేదని, భవిష్యత్తులో కూడా తాము రసాయన ఆయుధాలను వినియోగించమని స్పష్టం చేసింది.