: ఇక పెట్రోలు కొరత... లారీల సమ్మెకు మద్దతు పలికిన పెట్రోలు రవాణా సంఘం
ఇప్పటికే లారీల సమ్మెతో ఆరు దక్షిణాది రాష్ట్రాల్లో సరకు రవాణా నిలిచిపోగా, ఇక పెట్రోలు, డీజెల్ కు కొరత ఏర్పడనుంది. నేడు పాక్షికంగా, రేపటి నుంచి సంపూర్ణంగా బంకులకు పెట్రోలు రవాణాను నిలిపివేయనున్నామని పెట్రోలు ట్యాంకర్ల రవాణా సంఘం స్పష్టం చేసింది. గత ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న లారీ యజమానుల సంఘానికి తాము పూర్తి మద్దతు పలుకుతున్నామని సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ ఉదయం ఇంధన డిపోల గేట్ల వద్ద బైఠాయించిన లారీ, ట్యాంకర్ల యజమానులు ఆందోళనకు దిగారు.
చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని లారీల యజమానులు డిమాండ్ చేశారు. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం తగ్గించాలని, డీజెల్ పై వసూలు చేస్తున్న నాలుగు రూపాయల అదనపు విలువ ఆధారిత పన్నులను తగ్గించాలని, రవాణా శాఖకు సంబంధించి వసూలు చేస్తున్న రుసుముల పెంపును వెనక్కు తీసుకోవాలని, తమపై జరిమానా వేధింపులను ఆపాలని వారు డిమాండ్ చేశారు. పెట్రోలు ట్యాంకర్ల సమ్మె పూర్తి స్థాయిలో మొదలైతే, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిందే.