: హెచ్1బీ వీసాలపై కఠినతర ఆంక్షల వివరాలను ప్రకటించిన ట్రంప్ సర్కార్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం హెచ్ 1 బీ వీసాల జారీపై ఆంక్షలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వీసాలకు కావాల్సిన అర్హతల అంశాలను వివరించింది. మరింత కఠినతరమైన విధానాన్ని పాటిస్తున్నట్లు తెలిపింది. గత అమెరికా ప్రభుత్వాలు వీసాల జారీ వ్యవహారంలో ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఆ దేశ న్యాయశాఖ ఈ విషయంపై ఐటీ కంపెనీలకు తీవ్ర హెచ్చరికలు చేస్తూ... వీసాల జారీ కోసం అమెరికాకు చెందిన ఉద్యోగులను పక్కనపెట్టడాన్ని సహించబోమని తెలిపింది. ఈ విషయాన్ని పక్కనపెడితే, విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పింది.
వీసాలను జారీచేసే యూఎస్‌సీఐఎస్ విభాగం కొత్త ఆంక్షలను గుర్తించి వివరాలు తెలుపుతూ.. ఈ వీసాలు పొందాలనుకునే వారికి కేవలం డిగ్రీ ఉంటే సరిపోదని, దరఖాస్తు చేసుకునే ఉద్యోగానికి కావాల్సిన సాక్ష్యాలు, పేపర్ వర్క్‌లను కూడా చూపాలని తెలిపింది. ఇటువంటి నిబంధనలు అంతకు ముందు కూడా ఉన్నప్పటికీ, గత ప్రభుత్వాలు వాటిని అమలు చేయడంలో విఫలమయ్యాయని ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. ప్రతి సంవత్సరం అమెరికా సుమారు 85 వేల వీసాలను జారీ చేస్తే, వాటిల్లో 50 శాతం పైగా భారతీయ ఉద్యోగులే పొందుతున్నారు.