: కుమార్తె పెళ్లి చేసొచ్చి తాడో పేడో తేల్చుకుంటా: అజ్ఞాతం వీడిన తరువాత ఎమ్మెల్యే బండారు
మంత్రివర్గ విస్తరణ తరువాత అలిగి అజ్ఞాతంలోకి వెళ్లిన పెందుర్తి శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి, తిరిగి ఇంటికి చేరుకున్నారు. దాదాపు 24 గంటలకు పైగా ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లిపోయి.. ఆందోళన కలిగించిన ఆయన, ఇంటికి వచ్చారన్న విషయం తెలుసుకుని పలువురు అభిమానులు, కార్యకర్తలు వచ్చి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నానని, ఆ పనులు ముగిసిన తరువాత అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకుంటానని తెలిపారు. సీనియర్ నైన తనకు తగిన గౌరవం లభించలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ప్రస్తుతానికి ఎవరూ ఆందోళనలు, నిరసనలు చేయవద్దని కోరారు. కాగా, జూన్ 14న బండారు కుమార్తె శ్రీశ్రావ్య వివాహం శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడుతో జరగనున్న సంగతి తెలిసిందే.