: పార్టీలో సీనియర్ ను అయినా చంద్రబాబుకు దగ్గర కాలేకపోయా: గౌతు శివాజీ
టీడీపీలో సీనియర్ నేతను అయినప్పటికీ చంద్రబాబుకు తాను దగ్గర కాలేకపోయానని శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘గుర్తింపు లేదనే బాధ ఉన్న మాట వాస్తవమే. పార్టీ భవిష్యత్, యంగ్ జనరేషన్ భవిష్యత్ .. కోసం సర్దుకుపోతున్నాను. నా కార్యకర్తలందరినీ కూడా అదే దిశగా నడిపిస్తున్నాను. మంత్రి వర్గ విస్తరణలో నా పేరు వినబడటం, పదవి రాకపోవడమనేది ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా మంత్రి వర్గ విస్తరణ సమయలో నా పేరు వినపడింది. ముచ్చటగా మూడోసారి ఇప్పుడు కూడా నా పేరు వినపడింది. కానీ, పదవి మాత్రం దక్కలేదు... పదవులు దక్కలేదని సీనియర్లు అలిగారని నేను అనను. పార్టీ భవిష్యత్ కోసమే నా లాగానే సీనియర్లు ఆలోచిస్తున్నారు. ఈ విషయమై కూర్చుని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.
బొజ్జల గోపాలకృష్ణ వెలిబుచ్చిన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. బొజ్జలతో పాటు నేనూ కూడా చంద్రబాబు గీసిన గీతను దాటను.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాటల్లో పార్టీ ఏమైపోతుందోననే బాధ కనపడుతోంది. వారెవరూ పార్టీని వీడి వెళ్లేవారు కాదు. నా ముప్ఫై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు పక్కన ఏ సభలోనూ కూర్చునే అవకాశం దొరకలేదు. అదొక లోపమే నాకు. ఎందుకంటే.. నేను కొద్దిగా దూరం.. దురుసుగా వెళ్లను.. తోసుకుని వెళ్లను.. ఆయన పిలిస్తే వెళ్లి పక్కనే కూర్చుంటాను... కొందరు, ఆయన పక్కనే కూర్చున్నారు .. వెళ్లిపోయారు .. మళ్లీ వచ్చి పక్కనే కూర్చుంటున్నారు. అది వాళ్ల అదృష్టం.... సీనియర్లతో చంద్రబాబు ఓపెన్ డిస్కషన్ పెడితే చిన్న చిన్న సమస్యలు ఉండవని నా అభిప్రాయం... 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పినా నేను టీడీపీని వీడలేదు. నా తుదిశ్వాస వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ సన్యాసం తీసుకుంటాను’ అని గౌతు శివాజీ పేర్కొన్నారు.