: ఇక ఆనం బ్రదర్స్ వంతు... తమకు పదవి దక్కదన్న అనుమానంతో కినుక!
ఏపీ మంత్రివర్గ విస్తరణ చిచ్చు రేపగా, ఒక్కొక్కరినీ సముదాయిస్తూ, వస్తున్న చంద్రబాబునాయుడు, ఇక నెల్లూరు జిల్లాలో అలకబూనిన ఆనం బ్రదర్స్ పై దృష్టిని సారించారని తెలుస్తోంది. నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ విషయంలో పెద్దగా వ్యతిరేక వాతావరణం లేకపోయినప్పటికీ, ఒకరిద్దరు నేతలు ఆయనకు పదవి వద్దని అభ్యంతరాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఆనం రామనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలు నిన్న జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేదు. ఆపై ఆనం రామనారాయణ ఓ సమీక్ష నిర్వహిస్తూ, కాలం గడిపేశారు. మే నెలలో గవర్నర్ కోటా కింద ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం జరుగనుండగా, ఆనం బ్రదర్స్ లో ఒకరికి అవకాశం ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది.
మారిన పరిస్థితుల నేపథ్యంలో కడప జిల్లాలో ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి లభించడంతో, తీవ్రంగా వ్యతిరేకించిన రామసుబ్బారెడ్డికి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖాయం కావడంతో, అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన తమలో ఒకరికి ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం లేదని భావించిన ఆనం బ్రదర్స్ కినుక వహించినట్టు సమాచారం. అందువల్లే వీరు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదని తెలుస్తోంది. నెల్లూరుకు చెందిన మరో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి సైతం నిన్న వెలగపూడికి రాకపోవడం గమనార్హం. ఆనం బ్రదర్స్ అలకబూనిన విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు, వారితో తాను మాట్లాడతానని పార్టీ నేతలతో చెప్పినట్టు సమాచారం.