: కొందరికి అర్హత ఉన్నా మంత్రి పదవులు ఇవ్వలేకపోయిన కారణాన్ని చెప్పిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ నేతల్లో చాలా మందికి మంత్రి పదవులు నిర్వహించే సత్తా, అనుభవం ఉన్నా అందరికీ పదవులు ఇవ్వలేకపోయానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, 26 మందికి మించి మంత్రివర్గంలో స్థానం కల్పించే పరిస్థితి లేదని, కొందరికి మంత్రి పదవులు చేపట్టేందుకు అర్హత ఉన్నా సంఖ్యా పరిమితి అడ్డుగా నిలిచిందని అసంతృప్తులను అనునయించే ప్రయత్నం చేశారు. పరిస్థితులు అన్నీ తెలిసి కూడా క్రమశిక్షణ తప్పేలా వ్యవహరించడం ఎంతవరకూ సబబని ఎవరి పేరూ చెప్పకుండానే చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని, అలా కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమని ఎవరైనా భావిస్తే, తాను సహించబోనని స్పష్టం చేశారు. పార్టీకి మంచి జరుగుతుందని భావిస్తే ఎలాంటి నిర్ణయమైనా తీసుకునేందుకు వెనుకాడబోనని అన్నారు. ప్రజలు బాగుండాలంటే, పార్టీ కూడా బాగుండాలన్న విషయాన్ని నాయకులు అర్థం చేసుకుని ప్రవర్తించాలని హితవు పలికారు.