: నన్ను సీఎం చేస్తానని నాడు రాజీవ్ గాంధీ చెప్పారు: వీహెచ్
తనను సీఎం చేస్తానని నాడు రాజీవ్ గాంధీ చెప్పారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘నేను సీఎం కాకుండా ఉండేందుకు నాడు సీనియర్లు అందరూ ఏకమయ్యారు. స్పీడ్ ఉన్న నన్ను సీఎం చేస్తే ఇబ్బంది పడతామని చెప్పి నన్ను తొక్కేశారు. సీఎం కావాలంటే ఎస్సీ, పేద ఎమ్మెల్యేలకు డబ్బు లివ్వాలి. నా దగ్గర డబ్బులు లేవు. అందుకే, ఇవ్వలేకపోయా’ అని చెప్పుకొచ్చారు.
‘బీసీ కార్డు పేరుతో వీహెచ్ బ్లాక్ మెయిల్ చేస్తుంటారు?’ అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘నేను ఎప్పుడూ ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయలేదు’ అన్నారు. ఎమ్మెల్సీగా మూడేళ్లు, ఎమ్మెల్యేగా రెండేళ్లు, రాజ్యసభ సభ్యుడిగా పద్దెనిమిది సంవత్సరాల పాటు పని చేసిన మిమ్మల్ని ఇంకా అణగదొక్కారనడంలో అర్థం లేదనే ప్రశ్నకు వీహెచ్ సమాధానమిస్తూ, ‘ఈ సమాజంలో బడుగు, బలహీన వర్గాల ఆధిపత్యం రావద్దా?’ అంటూ ప్రశ్నించారు.