: ఆ మాటలు, విలువలు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా?: చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్
ఏపీ మంత్రి వర్గ విస్తరణలో పార్టీ ఫిరాయింపు దారులకు, ముఖ్యంగా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తప్పుబట్టారు. టీడీపీ పార్టీలో ఇంతకన్నా సమర్థులు లేరా? అని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారంటూ మండిపడ్డారు.
అమరావతి సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై హత్య చేశారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మంత్రులను చేసిన ఘనత చంద్రబాబుదేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వ్యవహారంలో కంచే చేను మేసినట్టుగా గవర్నర్ నరసింహన్ వ్యవహరించారని, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. నాడు తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవి కేటాయించినప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోవాలని, ఆ మాటలు, విలువలు ఆయనకు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.