: అమెరికాలో అంతే..!
అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి ఏ రీతిలో విస్తరించిందో పలు సంఘటనలు సోదాహరణంగా చాటాయి. తాజాగా, ఓ ఐదేళ్ళ బాలుడు తనకు బహుమతిగా లభించిన తుపాకీతో తన రెండేళ్ళ సోదరిని కాల్చి చంపిన ఘటన అందరినీ నివ్వెరపరిచింది. దక్షిణ కెంటకీలోని కంబర్లాండ్ కౌంటీలో ఈ విషాదం చోటు చేసుకుంది. క్రిస్టియన్ అనే బాలుడు ఆడుకుంటూ రైఫిల్ ను తన చెల్లెలు కరోలిన్ ఛాతీకి గురిపెట్టి కాల్చడంతో ఆ పాప అక్కడిక్కడే మృతి చెందింది. ఆ చిన్నారుల తల్లి స్టెఫానీ స్పార్క్స్ తుపాకీ కాల్పుల శబ్దం విని ఘటనా స్థలానికి వచ్చేసరికి కరోలిన్ రక్తపు మడుగులో ఉంది. అప్పటికే పాప చనిపోయింది.
కాగా, బాలుడు వినియోగించిన తుపాకీ పాయింట్ 22 కాలిబర్ రైఫిల్ అని తెలుస్తోంది. ఈ ఉదంతంపై కంబర్లాండ్ కౌంటీ ఎగ్జిక్యూటివ్ జడ్జి జాన్ ఫెల్ప్స్ స్పందిస్తూ, అమెరికా గ్రామీణ ప్రాంతాల్లో బాల్యం నుంచే చిన్నారులు వేటాడడంలో భాగంగా తుపాకీ వినియోగిస్తుంటారని, అదిక్కడ సర్వసాధారణమని చెప్పుకొచ్చారు.