: చంద్రబాబు రైల్లో బెర్తులన్నీ ఫుల్... వైకాపా నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పెద్ద పీట
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇక పూర్తి స్థాయిలో కనిపించనుంది. ఏపీలో మొత్తం 26 మంది మంత్రులకు అవకాశం ఉండగా, ఇప్పటివరకూ 20 మందితోనే నెట్టుకొస్తున్న చంద్రబాబు, ఇప్పుడు ఐదుగురిని తొలగించి, మరో 11 మందిని చేర్చుకుంటూ ఉండటంతో, మంత్రివర్గ బెర్తులన్నీ నిండిపోనున్నాయి. ఇక నూతన మంత్రుల్లో వైకాపా నుంచి గెలిచి రాజీనామా చేయకుండా, తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన వారికి చంద్రబాబు పెద్దపీట వేశారు. ఆ పార్టీ నుంచి ఫిరాయించిన వారిలో నలుగురికి మంత్రి పదవులు దక్కనున్నాయి.
వైకాపాకు చెందిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావులు నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాస్తవానికి వీరికి మంత్రి పదవులు ఇస్తే, న్యాయపరమైన చిక్కులు వస్తాయేమోనన్న చర్చ కూడా నడిచినట్టు తెలుస్తోంది. అయితే, పొరుగున ఉన్న తెలంగాణలో రెండేళ్లుగా ఇదే విధమైన పరిస్థితి ఉండటం, తెలుగుదేశం పార్టీకి చెందిన వారు టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవులను అనుభవిస్తూ ఉండటంతో, ఏ సమస్యా రాదన్న భావన టీడీపీ నేతలు వ్యక్తం చేయగా, ఆపై న్యాయ నిపుణులతో చర్చించిన చంద్రబాబు, వైకాపా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చేందుకే మొగ్గు చూపారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేయనున్న 11 మందిలో నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలే కావడం గమనార్హం.