: ‘యోగి’ బాటలో శివరాజ్.. ఆకతాయిలకు బుద్ధి చెప్పే ఉద్యమానికి శ్రీకారం!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాటలో నడుస్తున్నారు. ఆయన ప్రవేశపెట్టిన యాంటీ రోమియో స్క్వాడ్ తరహాలోనే మధ్యప్రదేశ్లో అమ్మాయిలపై వేధింపులకు పాల్పడే ఆకతాయిలకు బుద్ధి చెప్పేందుకు ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. అమ్మాయిలను ఎలా గౌరవించాలో ఆకతాయి కుర్రాళ్లకు తెలియడం లేదని, వారు సమాజానికి శ్రేయస్కరం కాదని పేర్కొన్న చౌహాన్ ఇటువంటి వారికి వ్యతిరేకంగా ఓ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. మహిళలు ఎవరికీ తక్కువ కాదని, ఎటువంటి భయం లేకుండా వారు స్వతంత్రంగా ఉండేలా పోలీసులు తగిన వాతావరణం కల్పించాలని, అమ్మాయిలను వేధించే నేరగాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.