: 'త్రిశూలం', 'ఆపద్బాంధవుడు', 'ప్రాణం'.. వంటి సినిమాలకు ప్రాణం పోసిన ఆ ఊర్లో రాంచరణ్ సినిమా షూటింగే చివరిదా?
కృష్ణంరాజు కెరీర్ లోనే మరపురాని సినిమా 'త్రిశూలం', చిరంజీవి కెరీర్ లో అద్భుతమైన సినిమాగా నిలిచిన 'ఆపద్బాంధవుడు', బాలకృష్ణ 'బంగారు బుల్లోడు', 'ఒక్కమగాడు', అల్లరి నరేశ్ కెరీర్ లో అద్భుతంగా నటించిన 'ప్రాణం' వంటి ఎన్నో సినిమాలకు ప్రాణం పోసిన లొకేషన్లు ఇకపై కనుమరుగు కానున్నాయి. ఈ సినిమాలన్నీ తూర్పుగోదావరి జిల్లాలోని పూడిపల్లిలో షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. సినిమాల్లో కథకు అక్కడి లోకేషన్లు మరింత అందాన్నిచ్చాయి.
ఈ గ్రామం పోలవరం ముంపు గ్రామాల్లో ఒకటి. దీంతో ఈ గ్రామం భవిష్యత్తులో కనుమరుగుకావచ్చు. ప్రస్తుతం ఇక్కడ సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా రూపొందుతున్న గ్రామీణ నేపథ్యమున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. సుదీర్ఘ షెడ్యుల్ కలిగిన ఈ సినిమా షూటింగ్ అనంతరం ఇక్కడ సినిమా షూటింగ్ లు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. కాగా, ఈ ప్రాంతంలో షూటింగ్ జరుపుకునే చివరి సినిమాగా రాంచరణ్-సుకుమార్ సినిమా నిలవనుంది.