: నేను ఉగ్రవాదిని కాదు.. కావాలంటే జైల్లో వేయండి: సుప్రీంకోర్టు ముందు కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్ కర్ణన్
కోర్టు ధిక్కార కేసును ఎదుర్కుంటున్న కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ఈ రోజు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయనను విధుల నుంచి దూరంగా ఉంచిన విషయం తెలిసిందే. తనను త్వరగా విధుల్లోకి పంపకపోతే తాను ఇక కోర్టుకు హాజరుకాబోనని చెప్పారు. ఈ రోజు ఆయన సుప్రీంకోర్టులో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ వ్యాఖ్యలు చేశారు. కావాలంటే తనను జైలుకి పంపాలని కూడా ఆయన అన్నారు.
ఈ రోజు జస్టిస్ కర్ణన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. దేశంలో అవినీతిపరులైన న్యాయమూర్తులు ఉన్నారంటూ కర్ణన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, క్షమాపణలు చెప్పాలని, అలా చేస్తే కేసు కొట్టేస్తామని బెంచ్ చెప్పింది. అందుకు కర్ణన్ అంగీకరించలేదు. అంతేగాక, తాను చట్టప్రకారమే నడుచుకున్నానని అన్నారు. తానేమీ ఉగ్రవాదిని కాదని, కావాలంటే జైల్లో ఉంచండని వ్యాఖ్యానించారు. కోర్టు ధిక్కార నోటీసులకు కర్ణన్ నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని ధర్మాసనం చెప్పింది.