: డౌన్ అయిన జియో సర్వర్లు... ఆగిన ప్రైమ్ సభ్యత్వ నమోదు!
రూ. 99 చెల్లించి జియో ప్రైమ్ సభ్యత్వం తీసుకునేందుకు నేడు ఆఖరు కాగా, లక్షలాది మంది ఒకేసారి సభ్యత్వం తీసుకునేందుకు రావడంతో, జియో వెబ్ సైట్ సర్వర్లు మొరాయించాయి. ఈ మధ్యాహ్నం నుంచి జియో ప్రైమ్ సభ్యత్వాన్ని పొందేందుకు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. 'www.jio.com' వెబ్ సైట్ ఓపెన్ అవుతున్నప్పటికీ, అక్కడి నుంచి ప్యాకేజ్ సెలక్షన్, చెక్ అవుట్ పని చేయడం లేదు. దీంతో కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఏడాది కాలపరిమితికి రూ. 99 తో జియో ప్రైమ్ తీసుకుని, ఆపై ఓ ప్యాక్ ను ఎంచుకుని డేటాను, కాల్స్ ను కొనసాగించవచ్చని రిలయన్స్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జియోకు సుమారు 10 కోట్ల మందికి పైగా కస్టమర్లు ఉండగా, ఇప్పటికే 5 కోట్ల మంది వరకూ ప్రైమ్ సభ్యత్వం తీసుకున్నట్టు సమాచారం.