: సుష్మ సహృదయం... 'మీరు ఆత్మహత్య చేసుకోవద్దు' అంటూ యువతికి సాయం!
తన దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు చేతనైనంతగా ప్రయత్నిస్తూ, అందరి మన్ననలూ అందుకుంటున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మరోసారి తన సహృదయాన్ని చాటుకున్నారు. తన భర్త న్యూజిలాండ్ లో ఉన్నాడని, అతన్ని కలుసుకునేందుకు వీసా కోసం ప్రయత్నిస్తుంటే, మూడు సార్లు రిజెక్ట్ అయిందని, ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమని జ్యోతి ఎస్ పాండే అనే యువతి చేసిన ట్వీట్ పై సుష్మ స్పందించారు.
"మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. సమస్యేంటో నాకు చెప్పండి" అంటూ రీ ట్వీట్ పెట్టారు. ఆపై వీసా దరఖాస్తు కాపీని తన కార్యాలయానికి పంపాలని చెబుతూ, తన ఈమెయిల్ అడ్రస్ ను కూడా ఇచ్చారు. సుష్మ స్పందించిన తీరుకు ముగ్ధురాలైన జ్యోతి, ఆపై ఆమెను అభినందించారు. తన గోడు విన్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడని ఆశీర్వదించారు.