: మరో 31 పట్టణాలను కొత్తగా కలపనున్న విమానరంగం


వేసవి విడిది కేంద్రాలైన కులు, సిమ్లాలకు ఇకపై సులువుగా చేరుకోవచ్చు. శీతాకాలంలో విడిది నిమిత్తం వెళ్లాలని భావించే వారు జైసల్మేర్ ఇసుక తిన్నెల మధ్యకు మరింత వేగంగా వెళ్లవచ్చు. తమ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ సంవత్సరం మరో 31 పట్టణాలకు విమాన సర్వీసులను నూతనంగా ప్రారంభించాలని విమానయాన రంగం నిర్ణయించింది. కేంద్రం ప్రతిపాదించిన అఫర్డబుల్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ లో భాగంగా, 128 పట్టణాలను గుర్తించగా, అందులో 31 పట్టణాలలో ఈ సంవత్సరం విమాన సర్వీసులను ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా అనుబంధ అలయన్స్ ఎయిర్, ఎయిర్ డక్కన్, ఎయిర్ ఒడిశా, టర్బో మేఘ సంస్థలు కొత్త రూట్లలో విమానాలు నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాయని పౌర విమానయాన శాఖ ప్రకటించింది.

ఇక చిన్న విమానాల్లో అంటే, 19 నుంచి 78 సీట్లున్న విమానాల్లో గంట ప్రయాణానికి గరిష్ఠంగా రూ. 2,500కు ధర మించరాదని కేంద్రం నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఇక తక్కువ ధరకు విమానాలు తిప్పడం ద్వారా ఏర్పడే వీజీఎఫ్ (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్) నష్టం సుమారు రూ. 205 కోట్ల వరకూ ఉంటుందని విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. కొత్త సేవలు ప్రారంభమైతే భారత ఏవియేషన్ మార్కెట్ మరింతగా పెరుగుతుందని, ప్రస్తుతం కేవలం 76 విమానాశ్రయాలకు మాత్రమే వాణిజ్య విమానాలు తిరుగుతుండగా, వచ్చే రెండేళ్లలో 50 పట్టణాలకు సేవలను ప్రారంభించాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News