: 1.2 లక్షలు చేతికందినా పోలీసుల నిర్వాకం వల్ల ఫలితం లేకుండా పోయింది!


లక్షా 22 వేల రూపాయలు చేతికందినా చెల్లకుండా పోయాయని ఉత్తరప్రదేశ్‌ లోని ఐరాదత్‌ నగర్‌ కు చెందిన దినేష్ చంద్ర గుప్త అనే వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆవేదనకు కారణం పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే....2015 డిసెంబర్ 28న ఆగ్రాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దినేష్ చంద్ర గుప్త సోదరి మరణించారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఆగ్రా వెళ్లారు. సోదరిని కోల్పోయానన్న బాధతో ఇంటికి వచ్చి చూస్తే... ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకెళ్లారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెలరోజుల్లోపే పోలీసులు దొంగలను పట్టుకున్నారు.

అనంతరం చట్టపరమైన కారణాలు చూపుతూ, పోలీసులు దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బు, నగలు బాధితుడు దినేష్ కు ఇవ్వలేదు. దీంతో ఆ డబ్బు కోసం మరోసారి దినేష్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు పోలీసులను మందలించడంతో ఫిబ్రవరి 7న నగలు, నగదు 1.22 లక్షల రూపాయలు ఆయనకు ఇచ్చేశారు. అయితే అప్పటికే పాత నోట్లు రద్దు కావడంతో, వాటిని మార్చుకునే గడువు ముగియడంతో ఆ డబ్బు చెల్లడం లేదు. బ్యాంకులు తీసుకోవడం లేదు. దీంతో పోయిన డబ్బు చేతికి వచ్చినా... ఉపయోగం లేకుండా పోయిందని దినేష్ చంద్రగుప్త ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆయన కుమార్తె వివాహం ఈ ఏడాది చేయాల్సి ఉంది...దీంతో ప్రధాని, ఆర్థిక మంత్రికి ఆయన లేఖలు రాశారు. వారి నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. 

  • Loading...

More Telugu News