: గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారు: ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ నిప్పులు
గోటితో పోయే అగ్రీగోల్డ్ సమస్యను ప్రభుత్వ పెద్దలు గొడ్డలి దాకా తీసుకు వచ్చారని జనసేనాని పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఈ మధ్యాహ్నం విజయవాడలో అగ్రీగోల్డ్ బాధితులతో మాట్లాడిన ఆయన, ఆపై ప్రసంగిస్తూ, తొలి రోజున అగ్రీగోల్డ్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన సమయంలోనే ప్రభుత్వం స్పందించివుంటే ఇన్ని ఆత్మహత్యలు జరిగి వుండేవి కాదని అభిప్రాయపడ్డారు. ఈ ఉదంతం వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉందని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. తాను రెండేళ్ల నుంచి ఈ సమస్య గురించి ఆలోచిస్తూనే ఉన్నానని, అప్పులు, వడ్డీల బాధలు ఎలా ఉంటాయో తనకు తెలుసునని అన్నారు.
రాజకీయ నాయకులు బాధితులపై ఆధిపత్యం చూపడం, వారి ఆందోళనపై పోలీసులను ప్రయోగించడం తనను కలచి వేసిందని తెలిపారు. ముందుగానే నివారించగలిగే సమస్యను జటిలం చేశారని ఆరోపించిన ఆయన, ఈ పరిస్థితికి అన్ని ప్రభుత్వాలూ కారణమేనని అన్నారు. 1995లో ప్రారంభించిన కంపెనీ ఇదని, వీళ్ల పెట్టుబడులన్నీ పేదల నుంచి పెట్టుబడులు స్వీకరించారని గుర్తు చేసిన పవన్, పేదలు కాబట్టే ఈ కేసులో ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయని అన్నారు. పిల్లలకు ఉపయోగపడతాయని, భవిష్యత్తుకు భరోసాగా ఉంటాయన్న ఆశతోనే పెట్టుబడులు పెట్టారని చెప్పారు. చట్టం బలహీనులపై బలంగా, బలవంతులపై బలహీనంగా పని చేస్తోందని, తప్పు చేస్తే ప్రశ్నించే దమ్ము, ధైర్యం సమాజానికి ఉండాలని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగం కొనసాగుతోంది.