: పవన్ గారు... స్టేట్ మెంట్లు వద్దు... ఆచరణ కావాలి: అగ్రీగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు
బాధితులకు అండగా ఉంటానన్న స్టేట్ మెంట్లు తమకు వద్దని, న్యాయం జరిగేలా ఉద్యమించి, ఆచరణలో చూపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు కోరారు. ఈ ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వచ్చిన పవన్ కు, బాధితుల సమస్యలను వివరిస్తూ, అనుమతిస్తే, లక్షలాది మంది తమ దీనగాథలను వేదికపై చెప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, అప్పుడు వారి కన్నీళ్లు వరదలై పారతాయని అన్నారు. సమయాభావం వల్ల కొంతమందికే మాట్లాడే అవకాశం ఇచ్చామని తెలిపారు. ఎన్నో రాజకీయ పార్టీలు తమను ఆదుకోవాలని చూసి, కేవలం డిమాండ్ చేయడం వరకే చేసి ఆగిపోయాయని, జనసేన అలా కాకుండా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రభుత్వం చేత పని చేయిస్తానన్న విశ్వాసాన్ని బాధితుల్లో కల్పించాల్సిన అవసరం ఉందని, ఆ మేరకు పవన్ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.