: నా మనవడు అమరావతికి వస్తే, ఆడుకునేందుకు పార్కులెక్కడ?: చంద్రబాబు
తన మనవడు దేవాన్ష్ అమరావతికి వస్తే, ఆడుకోవడానికి ఒక్క పార్కు కూడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తన అసంతృప్తిని వ్యక్తం చేశారట. ఈ విషయాన్ని అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీపార్థసారథి స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్ లో ఎన్టీఆర్ గార్డెన్స్ ను నిర్మించిన నాటి రోజులను గుర్తు చేసుకున్న ఆమె, ఆ పార్కు ప్రారంభోత్సవం నాడు చంద్రబాబు చిన్న పిల్లాడైపోయి, స్వయంగా టాయ్ కారులో పార్కంతా కలియదిరిగారని చెప్పారు. ఇటీవల సీఎంతో తాను సమావేశమైన వేళ, అమరావతిలో పార్కుల ప్రస్తావన వచ్చిందని, ఏడాది సమయం తనకు ఇస్తే, పిల్లలు, పెద్దలు ఆహ్లాదంగా గడిపేందుకు పార్కులను నిర్మిస్తానని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. శాఖమూరులో నిర్మించబోయే పార్కు అందరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉందని లక్ష్మీ పార్థసారథి తెలిపారు.