: భార్య మాట వినలేదని నిప్పంటించుకున్నాడు!
భార్యాభర్తల మధ్య విభేదాలు భర్తను బలిగొన్న ఘటన అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... గుత్తిలోని కటిక బజారులో షేక్ బషీర్, సాధిక సంజరీ దంపతులు నివాసముంటున్నారు. షేక్ బషీర్ పట్టణంలోని బీరువాల షాపులో పని చేస్తుండగా, అతని భార్య సాధిక సంజరీ పాటలు పాడుతుండేది. ఈ క్రమంలో బషీర్ తాగుడు, మట్కాకు బానిసయ్యాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు పొడసూపాయి. ఎంత చెప్పినా భర్త వినిపించుకోకపోవడంతో గత ఆరు నెలలుగా సాధిక అతనిని విడిచి వేరుగా ఉంటోంది.
ఈ క్రమంలో నిన్న రాత్రి ఆర్ అండ్ బీ బంగ్లాలో గుత్తి కోట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉగాదిని పురష్కరించుకుని 'సందడి చేద్దాం రండి' పేరుతో సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహించారు. ముందు రోజు ఆమె నివాసానికి వెళ్లిన బషీర్... రేపు సాయంత్రం అక్కడి వేడుకల్లో ఖవ్వాలీని పాడవద్దని బషీర్ ఆమెకు గట్టిగా చెప్పాడు. దీంతో నిన్న ఉదయం అతని నుంచి ప్రాణహాని ఉందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన బషీర్... ఆమె స్టేజ్ ఎక్కుతున్న సమయంలో పాటలు పాడవద్దంటూ మరోసారి ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు.
పాడకపోతే తాను బతికేదెలా? అంటూ ఆమె స్టేజ్ ఎక్కింది. దీంతో తన వెంట తెచ్చుకున్న బాటిల్ లోని పెట్రోల్ ను తన ఒంటి మీద పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. మంటలు శరీరమంతా వ్యాపించాయి. దీంతో అక్కడున్న కొందరు కంబళి తెచ్చి మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో, మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.