: ఎట్టకేలకు ఎర్రచందనం మహిళా స్మగ్లర్, మాజీ ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీ అరెస్ట్
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న మాజీ ఎయిర్ హెస్టెస్, స్మగ్లర్ సంగీత చటర్జీ (26)ని చిత్తూరు పోలీసులు మంగళవారం కోల్‌కతాలో అరెస్ట్ చేశారు. ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న సమయంలో ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్‌కు దగ్గరైన ఆమె అక్రమ రవాణాలోకి అడుగుపెట్టి కోట్లకు పడగలెత్తింది. అంతేకాదు, హవాలా ద్వారా భారీ నగదు లావాదేవీలకు పాల్పడింది.
గతేడాది కోల్‌కతాలోని ఆమె నివాసంలో దాడులు చేసిన చిత్తూరు పోలీసులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్ల నుంచి నకిలీ తుపాకీ లైసెన్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. సంగీత అరెస్ట్ కోసం పలుమార్లు ప్రయత్నించినా ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సాధ్యం కాలేదు. కాగా, 15 రోజుల క్రితం చిత్తూరు నుంచి కోల్‌కతా వెళ్లిన పోలీసుల బృందం రెక్కీ నిర్వహించి సంగీతను అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి ఆమెను చిత్తూరు తీసుకొచ్చారు.