: కమల్ ‘ఇస్లాం’ను నమ్ముతున్నారు.. ఆయన పేరులో ‘హసన్’ ఉందంటూ ఓ కాలమిస్టు ఆరోపణ!
మహాభారతంలో పాంచాలిని జూదంలో పావులా వాడుకున్నారు. అయినా సరే, ఆ గ్రంథాన్నే భారత్ ఇంకా గౌరవిస్తూనే ఎందుకు ఉందంటూ విలక్షణ నటుడు కమలహాసన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కమల్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఓ జాతీయ దినపత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. కమల్ తన మతం గురించి మర్చిపోయి, హిందూ, ముస్లింల మధ్య భేదాలు తలెత్తేలా ప్రవర్తిస్తున్నారంటూ సదరు కాలమిస్టు మండిపడ్డారు.
సమకాలీన సమస్యలు ‘ట్రిపుల్ తలాక్’ వంటి వాటిపై కమల్ శ్రద్ధ పెట్టాలని సూచించారు. అంతేకానీ, మతాలు, గ్రంథాల గురించి ప్రస్తావించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సింది పోయి, ఇష్టానుసారం మాట్లాడటం సబబు కాదని ఆ వ్యాసంలో సూచించారు. అంతేకాకుండా, కమల హాసన్ పేరులోని ‘హాసన్’ అనే పదం గురించి ప్రస్తావిస్తూ.. ఆ పదం ముస్లిం అర్థం వచ్చేలా ఉందని సదరు కాలమిస్టు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, కమల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ హావేరి జిల్లా అరమల్లాపుర శరణ బసవేశ్వర దేవాలయం పీఠాధిపతి ప్రణవానంద స్వామీజీ, ఆయన శిష్యులు ఇప్పటికే కేసు పెట్టారు.