: నాకేం భయం లేదు.. యూపీ సీఎంపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నాను: కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ నిజామీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై తన ట్విట్టర్ ఖాతాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కశ్మీర్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ నిజామీకి సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ అభిషేక్ ఆత్రే పరువునష్టం దావా నోటీసు పంపారు. అయితే, ఈ నోటీసుపై స్పందించిన సల్మాన్ నిజామీ.. యోగి ఆదిత్యనాథ్ అంటే తనకేమీ భయం లేదని, ఆయనపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని పేర్కొన్నారు. తమ లాయర్ ద్వారా ఆ నోటీసుకు సమాధానం ఇస్తానని చెప్పారు. తాను ఎవరో చెప్పినదాన్ని చెప్పబోనని, తాను నమ్మిన విషయాన్ని నిర్భయంగా ప్రకటిస్తానని ఆయన అన్నారు. సీఎం పదవికి యోగి ఆదిత్యనాథ్ తగరని తాను బలంగా విశ్వసిస్తున్నానని చెప్పారు.
మతోన్మాదులు, విద్వేషాలు రెచ్చగొట్టే వారిని వ్యతిరేకించే హక్కు భారత రాజ్యాంగం అందరికీ కల్పించిందని అన్నారు. అసలు ఉత్తరప్రదేశ్‌లో ఆదిత్యనాథ్ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదని, కమలం పార్టీ ఆయనను బలవంతంగా ప్రజలపై రుద్దుతోందని వ్యాఖ్యానించారు. ఇటీవలే సల్మాన్ నిజామీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ... ఓ వైపు ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ పై సాక్ష్యాలు లేనప్పటికీ ఆయనను వేటాడుతున్నారని.. మరోవైపు హత్య, దాడుల కేసులు ఎదుర్కొంటున్న ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రిని చేశారని పేర్కొన్నారు.