: యూఎస్ లో ‘కాటమరాయుడు’ సినిమా టికెట్లపై ఆఫర్.. ఒకటి కొంటే మరో టికెట్ ఉచితం!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అదే విధంగా, ఈ చిత్రానికి ఓవర్ సీస్ లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయట. ఓవర్ సీస్ లో ఇప్పటి వరకు విడుదలైన పవన్ కల్యాణ్ సినిమాల్లో ‘అత్తారింటికి దారేది’ మాత్రమే 1.90 మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించింది. ఈ రికార్డును ‘కాటమరాయుడు’ అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలతో పాటు పవన్ అభిమానులు కూడా భావిస్తున్నారు.
ఎందుకంటే, ‘కాటమరాయుడు’ చిత్రానికి ఇప్పటికే ఒక మిలియన్ డాలర్ల కు పైబడి కలెక్షన్లు వచ్చేశాయి. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, అమెరికా దేశంలో ‘కాటమరాయుడు’ని వీక్షించే ఎన్ఆర్ఐలకు సోషల్ మీడియా యాప్ లు పలు రాయితీలు కల్పిస్తున్నాయి. ‘ఫండాంగో’ యాప్ ద్వారా ‘కాటమరాయుడు’ చిత్రానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ టికెట్లు కొనుగోలు చేసిన వారికి మరో టికెట్ ఉచితంగా ఇస్తున్నారు. అలాగే, రీగల్ సినిమాస్, ఏఎమ్ సీ థియేటర్స్, సినీ మార్క్ థియేటర్స్ వద్ద ఈ రోజు ‘కాటమరాయుడు’ టికెట్లను ఒకటి కొంటే మరోటి ఉచితంగా ఇస్తుండటంతో ఈ అవకాశాన్ని ఎన్ఆర్ఐలు ఉపయోగించుకుంటున్నారు.