: పోలీసుల కోసం మేము పోరాడుతుంటే.. వారు మాత్రం మాకు సహకరించడం లేదు: వైసీపీ ఎమ్మెల్యేలు
రవాణాశాఖ ఉన్నతాధికారులపై టీడీపీ నేతలు చేసిన దాడికి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను అసెంబ్లీ వద్ద నుంచి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో, ఆయనను పరామర్శించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు మంగళగిరి పీఎస్ వద్దకు వెళ్లారు. అయితే, వారిని పీఎస్ లోకి పోలీసులు అనుమతించలేదు. అంతేకాదు, వారిని ప్రాంగణం లోపలకు రానివ్వకుండా, పోలీస్ స్టేషన్ గేట్లు మూసేశారు. దీంతో, వైసీపీ ఎమ్మెల్యేలు గేటు వద్దే నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కూడా పోలీస్ స్టేషన్ లోపలకు రానివ్వకపోవడం దారుణమని వారు వాపోయారు. కాసేపు 144 సెక్షన్ ఉందని చెబుతారని.. మరికాసేపు ఏదేదో చెబుతారని మండిపడ్డారు. రవాణా కమిషనర్ కు, ఆయనకు భద్రతగా ఉన్న పోలీసులకు అవమానం జరిగిందన్న కారణంతోనే తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని... అయినా కూడా పోలీసులు తమకు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.