: రాష్ట్రంలో ఏం జరిగినా జగనే చేశాడని అనడం టీడీపీకి అలవాటే!: జగన్
ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగినా అది జగనే చేశాడని అనడం టీడీపీ నేతలకు అలవాటేనని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... ఆరెంజ్ ట్రావెల్స్‌తో తనకు సంబంధం ఉందని ఆరోపణలు గుప్పిస్తున్నారని, ఉంటే నిరూపించాలని సవాలు విసిరారు. లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ట్రావెల్స్ బస్సుల వ్యవహారంలో ప్రభుత్వం తీరు బాగోలేదని అన్నారు. అధికార పార్టీ నేతలు ఎలాంటి తప్పు చేసినా చర్యలు తీసుకోరా? అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు ఏం తప్పు చెయ్యకపోయినా కేసులు నమోదు చేస్తున్నారని, మరోవైపు ఆర్టీఏ అధికారులతో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి అధికారపక్షనేతలు క్షమాపణ చెప్పేస్తే వారిపై చర్యలు తీసుకోవట్లేదని జగన్ అన్నారు. శాసనసభలో రోజుకో ప్రజెంటేషన్ పేరుతో సమయాన్ని వృథా చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని చిత్తశుద్ధితో పూర్తి చెయ్యడం లేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడి పాలనలో అన్నీ స్కాములేనని అన్నారు. శాసనసభలో ప్రజా సమస్యలపై మాట్లాడడానికి తనకు సమయం ఇవ్వడం లేదని అన్నారు.