: ప్రపంచంలో అత్యధిక అప్పులు అమెరికాకే ఉన్నాయి!: కేసీఆర్
తమ ప్రభుత్వం అప్పులు చేస్తోందంటూ ప్రతిపక్ష సభ్యులు విమర్శలు చేస్తున్నారని, ఆ విమర్శలు సరికావని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు ఆయన శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ.. ఎకనామిక్స్‌లో ట్రెండ్స్ మారిపోయాయని, ప్రపంచం ఎటు వెళుతుందో మనమూ అటు వైపే వెళ్లాలని అన్నారు. ప్రపంచంలో అత్యధిక ధనిక దేశం అమెరికా అని, అత్యధిక అప్పులు కూడా ఆ దేశానికే ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వారు మనకన్నా తెలివిఎక్కువ వారే కానీ, తెలివి తక్కువ వారు కాదు అని అన్నారు. అప్పులు తెచ్చుకునే వీలు ఉంటే తెచ్చుకోవచ్చని అన్నారు. అప్పులు తెచ్చి వాటిని ఖర్చు పెట్టకపోతేనే తప్పవుతుందని చెప్పారు. అప్పులు తీసుకోవడమే కాదు.. మళ్లీ తిరిగి తీరుస్తూనే ఉంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తిరిగి చెల్లిస్తూనే ఉందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డులను త్వరలో రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ అన్నారు. తాము మెస్ చార్జీలను పెంచుతున్నామని, దానితో 18లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే విద్యుత్ కొరతను అధిగమించేందుకు తీవ్రంగా శ్రమించి, ఆ కొరతను తీర్చామని చెప్పారు. తెలంగాణలో డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నామని అన్నారు. అలాగే రాష్ట్ర ఆర్థిక ప్రగతి బాగుండడంతోనే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు.