: పవన్ కల్యాణ్ తో కేటీఆర్ సెల్ఫీ... తెలంగాణలో దుమారం!
ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'కాటమరాయుడు'ను టీఎస్ మంత్రి కేటీఆర్ చూశారు. అంతేకాదు, పవన్ కల్యాణ్ తో సెల్ఫీ కూడా దిగారు. ఈ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటో చుట్టూ కొత్త రాజకీయం ప్రారంభమైంది. సరికొత్త వివాదం రాజుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ తో కలసి ఫొటో దిగడమేంటని కొందరు తెలంగాణవాదులు కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
పవన్ కల్యాణ్ పై కేసీఆర్ కుటుంబీకులంతా విమర్శలు గుప్పించిన వారే. ఎన్నికల ప్రచారం సమయంలో పవన్ పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. కవిత కూడా పలు సందర్భాల్లో పవన్ ను విమర్శించారు. ఈ నేపథ్యంలో, కేటీఆర్ పై ట్విట్టర్ వేదికగా తెలంగాణ ప్రాంతానికి చెందిన నెటిజన్లు విమర్శిస్తున్నారు. పవన్, కేటీఆర్ ల కలయికను ఇష్టపడటం లేదని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. తెలంగాణను వ్యతిరేకించిన పవన్ తో సెల్ఫీ దిగడానికి కేటీఆర్ ఆసక్తి చూపడం తమకు నచ్చలేదని చెప్పారు. మరోవైపు కేటీఆర్ ను మరికొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తున్న పవన్ కల్యాణ్ పట్ల టెక్స్ టైల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కు అభిమానం ఉండటంలో తప్పులేదని... ఆ అభిమానంతోనే సెల్ఫీ దిగారని కొందరు అంటున్నారు.
Watched @PawanKalyan KatamaRayudu. You have a sure winner Kalyan & @sharrath_marar Appreciate the subtle but strong promotion of Handlooms