: లోకేష్ టపాసులు కాల్చిన తరువాతే అధికారులకు దీపావళి!: బ్రాహ్మణి చిన్ననాటి సరదా ఘటన
తన చిన్నతనంలో మామయ్య చంద్రబాబును చూసిన సందర్భాలు చాలా తక్కువగా ఉండేవని చెప్పిన నారా బ్రాహ్మణి, ఓ దీపావళి నాటి సరదా ఘటనను గుర్తు చేసుకున్నారు. దీపావళి నాడు అధికారులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారని, రాత్రి 8 గంటలైనా అధికారులను ఆయన వదల్లేదని, సమయాన్ని మరచిపోయి మరీ మాట్లాడుతున్న వేళ, పండగపూట ఇంటికెప్పుడు వెళదామా అని అధికారులు ఎదురు చూస్తుండగా, లోకేష్ చేసిన పనితో వారికి ఉపశమనం లభించిందని చెప్పారు.
ఆ సమావేశం జరుగుతున్న గదికి దగ్గరలో లోకేష్ టపాకాయలు కాల్చడంతో, ఆ శబ్దం విన్న తరువాత మామయ్యకు దీపావళి అన్న విషయం స్ఫురణకు వచ్చి, ఈ రోజు దీపావళా? అని అడిగి అధికారులను ఇక వెళ్లండని చెప్పారని, ఈ విషయాన్ని ఓ ఉన్నతాధికారి ఒకరు తనకు చెప్పారని బ్రాహ్మణి వెల్లడించింది. ఆయనకు పనే లోకమని, దేవాన్ష్ తో కలిస్తే మాత్రం ఎన్నో కబుర్లు చెప్పుకుంటారని గుర్తు చేసుకున్నారు.
ఓ ఆవును చూసి ఇదేంటని దేవాన్ష్ అడుగగా, ఆయన ఏకంగా ఆవు కథనే చెప్పారని, ఆవు తెల్లగా ఉంటుందని మొదలు పెట్టి, పాలు, పెరుగు నుంచి రాష్ట్రంలో ఎన్ని ఆవులు ఉంటాయన్న లెక్కలు, ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి? వాటి పోషణ ఎలా? తదితర విషయాలన్నీ గణాంకాలతో సహా చెప్పారని తెలిపారు.